పెట్టుబడి పాఠాలు పట్టవా?

ఆధారం: http://www.eenadu.net/archives/archive-23-4-2007/emsmain.asp?qry=2204ems8

పెట్టుబడి పాఠాలు పట్టవా?

మార్కెట్‌తో మంచే జరుగుతుంది
సోషలిజం వైపు మళ్లడం అహేతుకం

గురుచరణ్‌దాస్‌

ఆర్థిక సంస్కరణల లోతైన పాఠాల నుంచి మనం ఇంకా ఏమీ నేర్వలేదన్న విషయాన్ని- ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలు రుజువుచేస్తాయి. ఇదే విధానం కొనసాగితే- 1991 దాకా నాలుగు దశాబ్దాలపాటు దేశంలో వర్ధిల్లిన బ్యూరోక్రాటిక్‌ సోషలిస్ట్‌ రాజ్యంలోకి మళ్లీ మనం మళ్లినా ఆశ్చర్యంలేదు. 1970లలో కమాండ్‌, కంట్రోల్‌ ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థాయిలో ఉండేది. దాన్ని ‘గరీబీ హఠావో’లాంటి జనాకర్షక నినాదాల్తో సమర్థించుకున్నాం. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం సిమెంటు, ఉక్కు ధరలపై మళ్లీ నియంత్రణలు తీసుకువచ్చింది. నిరంతరాయంగా పెరిగే వడ్డీరేట్లు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏ మాత్రం ఉపకరించవు. చిన్న ఇల్లు కట్టుకోవడానికో, చిరు వ్యాపారం ప్రారంభించడానికో ఖర్చు తడిసిమోపడయ్యేలా మాత్రం ఇది తోడ్పడవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ను నిషేధించారు. వాస్తవానికి ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ ద్రవ్యోల్బణాన్ని కొంతలో కొంత అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు సీజన్‌లోనే వస్తాయి. కానీ ఆహార వినియోగం ఏడాది పొడుగునా ఉంటుంది. అభివృద్ధి నిరోధానికి ద్రవ్యోల్బణాన్ని కుంటిసాకుగా చూపుతున్నారు. ‘లైసెన్స్‌ రాజ్‌’ పునరుద్ధరణకూ ఇదే ఓ బూచిగా కూడా కావొచ్చు.

చాలామంది భారతీయులు ముఖ్యంగా మేధావులు మార్కెట్‌ను ఎందుకు ద్వేషిస్తారని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటా. నాకు రెండు సమాధానాలు స్ఫురిస్తాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను కాపాడే ఓ పెద్దదిక్కంటూ లేదు కాబట్టి దానికి దూరంగా ఉండటం మేలని జనం అనుకోవడం ఇందులో మొదటిది. మార్కెట్‌ను వ్యాపారితో సరిపోల్చి, అతనో మోసగాడని అనుకోవడం ఇందులో రెండోది. కాబట్టి మార్కెట్‌ను గాడిలో పెట్టడానికి ప్రభుత్వ పెద్దచేతులు ఎంతో అవసరం. సాధారణ పౌరుడికి మార్కెట్‌ మంచి మిత్రుడన్న విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఎలా అంటే… వ్యాపారిని, రాజకీయ నాయకుడినీ పోటీపడేలా చేసేది మార్కెట్‌ ఒక్కటే. అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని మన మార్కెట్‌ను అనుమానాస్పద దృష్టితో చూస్తున్నాం. ఈ అనుమానం పెనుభూతం కావడం వల్లే బహుళజాతి కంపెనీలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బలి అవుతున్నారు. ఈ వ్యాకులతతోనే స్వదేశీ వస్తువుల వైపు మొగ్గుచూపుతున్నాం. కానీ ఇది అహేతుకం. ఎందుకంటే కంపెనీల మధ్య పోటీ వల్ల సామాన్యుడికి మేలు జరుగుతుంది. ధరలు తగ్గుతాయి. వస్తూత్పత్తి నాణ్యత మెరుగుపడుతుంది.

1991 నాటికే కాలం చెల్లిపోయిన సోషలిజం వైపు మళ్లీ మళ్లడం అహేతుకం. సోషలిజంలోని లోటంతా సామర్థ్యమే, అంతేతప్ప నమ్మకం లేకకాదు. సోషలిజం బాగాపనిచేసి ఉంటే మనమంతా ఈ రోజు సోషలిస్టులుగా ఉండేవాళ్లం. దారిద్య్రాన్ని, అణచివేతల్ని తరిమికొట్టి సమసమాజాన్ని నిర్మించడానికి ఉద్దేశించిన సిద్ధాంతమది. కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచంలో ఎక్కడచూసినా ఇది ఆధిపత్య రాజ్యస్థాపనకు, ప్రజల అణచివేతకు దోహదపడింది. దీనికి సాక్ష్యాలు అనేకం. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో సోషలిజంపై అనేక ప్రయోగాలు జరిగాయి. జర్మనీ, కొరియా, వియత్నాం(ఆఖరికి చైనాలో కూడా 1980 దాకా)లు రెండుగా విడిపోయి, ఓవైపు కేపిటలిజం, మరోవైపు సోషలిజం రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రతిచోటా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న భాగంలో అభివృద్ధి బాగా జరిగింది. స్వేచ్ఛ, అవకాశాలు ఇక్కడే మెరుగ్గా ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలామంది భారతీయులు మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను అంగీకరించడానికి ఇబ్బందులు పడుతున్నారు.

సామాన్యులకు ముఖ్యంగా పేదలకు ఉపయోగపడదనే కారణంపై చాలామంది మార్కెట్‌ను నమ్మరు. కానీ వాస్తవం దీనికి విరుద్ధం. భారత్‌, చైనాల్లో ప్రజలు మార్కెట్‌ వల్లే ఎక్కువ ప్రయోజనం పొందారనేది చరిత్ర చెప్పిన సత్యం. అలాంటపుడు ఎందుకీ అపోహలు ఏర్పడినట్లు? నా మిత్రుడు రఘురామ్‌ రాజన్‌, అతని సహచరుడు ల్యూగీ జింగాలెస్‌లు తమ ‘సేవింగ్‌ కేపిటలిజం ఫ్రం కేపిటలిస్ట్స్‌’ అనే తమ పుస్తకంలో దీనికో సమాధానం ఇచ్చారు. స్వేచ్ఛా మార్కెట్‌కు కూడా నిబంధనలుండాలని వారు వాదించారు. కానీ ఈ నిబంధనల్ని రాజకీయంగా శక్తిమంతమైనవారు తమ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందిస్తారనేది మనకు తెలిసిన సత్యం.

తక్కువ దిగుమతి సుంకాల వల్ల సామాన్యులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్న విషయం మనందరికీ తెలుసు. దీనివల్ల ధరలు తగ్గుతాయి. నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. కానీ చాలామంది భారత పారిశ్రామిక వేత్తలు ప్రపంచ పోటీ అంటే భయపడతారు. ఎక్కువ దిగుమతి సుంకాల కోసం ఒత్తిళ్లు తెస్తుంటారు. స్వేచ్ఛా విపణిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వ గుత్తాధిపత్యాల వల్ల లక్షలకొద్దీ వినియోగదారులు నష్టపోతుంటారు. ప్రభుత్వరంగంలోని కార్మికులు మాత్రం ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ఉంటారు. ప్రభుత్వ యాజమన్యం వల్ల రాజకీయ నాయకులు, బ్రూరోక్రాట్లు, ప్రభుత్వ రంగంలోని కార్మికులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. శక్తిమంతమైన పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల గుప్పిట్లోకి మార్కెట్‌ వెళ్లకుండా సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు తయారుచేయడమన్నదే మన ముందున్న సవాలు.

కేపిటలిజంపై ఏహ్యభావానికి పదప్రయోగ సంబంధ కారణమూ ఉందని నేను అనుకుంటూ ఉంటా. భారత్‌లో చాలామంది కేపిటలిజంను స్వార్థంతో సరిపోలుస్తుంటారు. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్‌స్మిత్‌ స్వప్రయోజనం అనే మాట వాడినపుడు సామాన్యుడిని దృష్టిలో ఉంచుకున్నాడే తప్ప మరో ఉద్దేశంతో కాదు. మనం మార్కెట్‌కు వెళ్లినపుడు తక్కువధరకు నాణ్యమైన మామిడిపండ్లు కావాలని కోరుకుంటాం. ఇది స్వార్థంకాదు, స్వప్రయోజనం. కొనుగోలు, అమ్మకాల్లో ప్రతివ్యక్తీ ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తూనే… తానూ ఎంతోకొంత ప్రయోజనం పొందుతాడు. సొంత ప్రయోజన ప్రవర్తనతో ప్రతిఒక్కరూ లాభపడతారు. కానీ స్వార్థం కలిగిన వ్యక్తి నైతికంగా తటస్థంగా ఉండడు. ఇతరుల ప్రయోజనాన్ని దెబ్బతీసి తన ప్రయోజనం కోసం పాటుపడతాడు. సంప్రదాయ, సోషలిస్టు సమాజాల్లో స్వార్థపరులున్నట్లే… మార్కెట్లోనూ స్వార్థపరులున్నారు.
(రచయిత ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్‌ ఇండియా
మాజీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌)

సీ.డీలు – డీ.వీ.డీలు

మోసరుబేరు కంపెనీవాడు ఈమద్య 28 రూపాయలకే సినిమా సీడీలు మరియు 34 రూపాయలకే డీవీడీలు అమ్మడం మెదలు పెట్టాడు. వీడు చేసిన ఇంకొక మంచిపని ఆన్లైలోకూడా కొనుక్కునే విధంగా ఒక సైటును రూపొందించడం. మీరు భారతదేశంలో ఏమూలనున్నా http://www.moserbaerhomevideo.com/సైటులోనికి వెళ్ళి, మీకు కావలసిన సినిమాల సీడీలు, డీవీడీలు కొనుక్కోవచ్చు. ఆ సీడీలను మీకు బట్వాడా చేయించుకోడానికి మాత్రం అధనంగా ఇంకొక 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అయితే, 20 కంటే ఎక్కువ సీడీలు/డీవీడీలు కొన్నవారికి మాత్రం ఉచితంగా బట్వాడా చేస్తానని చెబుతున్నాడు.