ఇన్సూరన్సు – టర్ము పాలసీలు, ఎండోమెంటు పాలసీలు

మార్చి వస్తోందంటేనే ఉద్యోగస్తులదరి దృష్ఠి ఆదాయపు పన్ను మీదే ఉంటుంది. కారణం, ఈపన్నుపోటు తప్పించుకొనడానికి ఏమిచెయ్యాలన్నా ఇదే ఆఖరునెల కావడం. పన్ను తప్పించుకోడానికి సాదారణంగా అందరూ చేసే పని ఆలోచించకుండా మన ఏజంటు చెప్పిన దాన్నిబట్టి ఏదో ఒక ఇన్సూరన్సు పాలసీ తీసేసికోవడం. ఇలా ఆలోచించకుండా ఏ పాలసీపడితే, ఆపాలసీ తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇక్కడ చర్చిద్దామనుకుంటున్నాను.

ముందుగా మనం తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే, ఇన్సూరన్సు పాలసీలు పన్ను ఆదా చేయడం కోసం ఉద్దేశించినవి కావు. మనకేదైనా జరుగరానిది జరిగితే, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఆర్ధికంగా ఎప్పటిలాగానే జీవించగలిగేలా చూడటానికి ఈపాలసీలు ఉద్దేశింపబడ్డాయి. ఈ ఇన్సూరన్సు పాలసీలను స్థూలంగా, రెండు రకాలుగా విడగొట్టవచ్చు

 1. ఎండోమెంటు పాలసీలు

  ఈరకం పాలసీ అమలులో ఉన్నప్పుడు విధివశాత్తు మరణం సంభవించినట్లయితే, మన కుటుంబానికి పాలసీ మొత్తాన్ని, దానితోపాటుగా అప్పటి వరకు మనం చెల్లించిన మొత్తంమీద కొంత వడ్డీని (దీనినే బోనస్సు అనికూడా అంటారు) అందజేయడం జరుగుతుంది. లేకపోతే, పాలసీ గడువుతీరినప్పడు పాలసీమొత్తాన్ని కొంత వడ్డీతో కలిపి మనకు చెల్లిస్తారు. ఈపాలసీలకు ఉదాహరణగా L.I.C వారి జీవన్ శ్రీ మరియు జీవన్ ఆనందులను చెప్పుకొనవచ్చు.

 2. టర్ము పాలసీలు

  ఈపాలసీలు అమలులో ఉన్నప్పుడు, ఏదయినా కారణం వల్ల మనకు మరణం సంభవించినట్లయితే, మన కుటుంబానికి పాలసీ మొత్తాన్ని అందజేస్తారు. వీటిలో మనం చెల్లించవలసిన ప్రీమియం తక్కువగా ఉండి, పాలసీ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరకానికి చెందిన పాలసీలలో, గడువు ముగిసినప్పుడు మనం చెల్లించినదానిలో ఏమీ తిరిగి ఇవ్వరు. ఈరకానికి ఉదాహరణగా L.I.C వారి అమూల్య జీవన్ మరియు అన్మోల్ జీవన్ పాలసీలను చెప్పుకొనవచ్చు. 
   

ఇప్పుడు, ఈ రెండు రకాల పాలసీలలో ఏది తీసుకొనడం ఆర్ధికంగా మనకు మంచిదో చూద్దాం. ఉదాహరణకు, రాము అనేవ్యక్తిని తీసుకుందాం. ప్రస్తుంతం రాము వయసు 25 సంవత్సరాలు. అతను 15 సంవత్సరాలపాటు, 25 లక్షలకు ఇన్సూరన్సు పాలసీ తీసుకొందామనుకున్నాడు. ఇంత మొత్తానికి ఎండోమెంటుపాలసీ తీసుకోడానికి, సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం ఎంతో L.I.C వారి ప్రీమియం కాలిక్యులేటర్లో చూస్తే రూ.1,65,114 అని తేలింది. ఇదే మెత్తానికి టర్మ్ పాలసీ కోసమయితే అతను సంవత్సరానికి కేవలం రూ.5,550(అవును, కేవలం అయిదువేల అయిదు వందలే!) చెల్లిస్తే సరిపోతుంది. ఇలా టర్ము పాలసీ తీసుకోగా మిగిలిన మొత్తాన్ని రాము కనుక వేరేవిధంగా మధుపు చేస్తే పాలసీ గడువు ముగిసే సరికి ఎండోమెంటు పాలసీలోకంటే ఎక్కువ మెత్తాన్ని ఆర్జించవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
 
ఎండోమెంటు పాలసీల మీద సాదారణంగా చాలా తక్కువ మొత్తం వడ్డీ(వారి బాషలో బోనస్సు) చెల్లిస్తారు. అందరూ ఎక్కువగా ఎండోమెంటుపాలసీలు తీసుకొనే L.I.C వారు, గడచిన 4-5 సంవత్సరాలుగా ఇస్తున్న బొనస్సు 4-5 శాతం మాత్రమే. 5 శాతం బోనస్సు ప్రకారం చూస్తే రాము ప్రతిసంవత్సరం రూ.1,65,114 చెల్లిస్తే, 15 సంవత్సరాల తరువాత జీవించి ఉంటే అతనికి రూ.37,41,069 తిరిగి వస్తాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఈగడువులో అతను మరణిస్తే అతని కుటుంబానికి 25 లక్షలు + అప్పటి వరకు వచ్చిన బోనస్సు ఇవ్వబడుతుంది.
 
అదే రాము, పైన చెప్పిన విధంగా రూ. 5500 టర్ము పాలసీని తీసుకొని, మిగిలిన రూ. 1,59,614 మెత్తాన్ని PPFలో పెట్టాడనుకుందాం. గత 4-5 సంవత్సరాలుగా తీసుకొంటే PPF లో సాలీనా 8-10 శాతం వడ్డీ వస్తుంది. 8 శాతం వడ్డీ ప్రకారం చూస్తే 15 సంవత్సరాలు ముగిసే సరికి రూ.46,80,566 తిరిగి పొందవచ్చు. ఒకవేళ ప్రమాదవశాత్తు రాము ఈగడువులో మరణించినట్లయితే టర్ముపాలసీనుండి 25 లక్షలు + PPF లో అప్పటి వరకు జమయిన మొత్తం, వడ్డీతో సహా అతని కుటుంబానికి అందుతాయి.
 
ఇదే రూ. 1,59,614లను, రాము పన్ను మినహాయింపు ఉన్న మ్యూచుయల్ ఫండులలో(E.L.S.S) పెడితే ఇంకా ఎక్కువ రాబడి సాధించే అవకాశంకూడా ఉంది. గత 5-6 సంవత్సరాలలో సంవత్సరానికి 50 శాతం వరకు రాబడి ఇచ్చిన ఫండులు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలోకూడా 15 సంవత్సరాల పాటు సాలీనా 50% రాబడి ఆశించడం అత్యాశే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో 15% రాబడి ఆశించడం అత్యాశ కాబోదు. ఇలా సాలీనా 15% రాబడి వస్తే రాము 15 సంవత్సరాల తరువాత రూ. 87,33,676 పొందవచ్చు. 
 

ఇప్పుడు మీలో కొందరికి వచ్చే అనుమానాలను ఇక్కడ తీర్చడానికి ప్రయత్నిస్తాను. 

 1.  నేను ఎంత మెత్తానికి ఇన్సూరన్సు పాలసీ తీసుకోవాలి?
 2. సాదారణంగా మనకు వస్తున్న ఆదాయం మీద మన కుటుంబ జీవన శైలి ఆధారపడి ఉంటుంది. మీరులేనప్పుడు కూడా మీకుటుంబం అలానే జీవించాలంటే ఎంత మొత్తం సరిపోతుందనుకుంటున్నారో, అంతకు తీసుకోండి. సాదారణంగా (సంవత్సర ఆదాయం * 8 – ప్రస్తుతం మనకున్న ఆస్తి) కి పాలసీతీసుకుంటే  సరిపోతుంది. ఇవి కొంచం పెద్దమొత్తంలో ఉంటాయి కాబట్టి, చాలా మందికి అవసరమయినంత పాలసీ తీసుకోవాలంటే కేవలం టర్ము ప్లానులోనే సాధ్యమవుతుంది.

 3. నా ఇన్సూరన్సు ఏజంటు ఎండోమెంటు పాలసీలను తీసుకొనమని గట్టిగా చెబుతున్నాడు, ఎందుకు?
 4. ఎందుకంటే, అతనికి వచ్చే కమీషను దానిలోనే ఎక్కువ కాబట్టి. సాదారణంగా పాలసీలలో మనం చెల్లించే ప్రీమియంలో 10 శాతం వరకు మన ఏజంటుకు అందుతుంది. ఎండోమెంటు పాలసీలలో మనం చెల్లించే ప్రీమియం అధికంగా ఉంటుంది కాబట్టి వారికి వచ్చే కమీషను కూడా అధికమే. అదికాక, ఎండోమెంటు పాలసీలో అయితే మెదటి సంవత్సర వాయిదాలలో అధనంగా మరొక 25% వారికే వెల్తుంది. అందుకే చాలా మంది ఏజంట్లు మెదటి ప్రీమియం చెల్లించడానికి కూడా సిద్దపడుతుంటారు.

 5. ఎండోమెంటు పాలసీలలో వచ్చే బోనస్సు(వడ్డీ) రేటు ఎందుకంత తక్కువగా ఉంటుంది?
 6. దీనికి కూడా ఏజెంట్లకి ఇచ్చే కమీషను ఒక ప్రధాన కారణం. మెదట్లో ఇన్సూరన్సుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఏజంట్లకు ఎక్కువ కమీషను ఇవ్వడం మెదలు పెట్టి ఉండొచ్చు. ఇవి కాక ఇన్సురన్సు కంపనీలు మన డబ్బును ఎక్కడ మదుపు చేస్తున్నాయన్న దాని మీద కూడా మనకొచ్చే బోనస్సు ఆధారపడి ఉంటుంది.

 7. యూలిప్పులని (ULIP), హోల్ లైఫులని ఇంకా వేరే రకాల పాలసీలు వస్తుంటాయి కదా, వాటిగురించి?
 8. ఏరకమయిన పాలసీ అయినా దాదాపు ఒకే పద్దతిలో నడుస్తుంటుంది. మనం చెల్లించినదానిలో కొంత మెత్తాన్ని మన ఇన్సూరన్సుకోసం ఉంచి మిగిలిన దాన్ని స్టాకు మార్కెట్టులోనో, ఇంకో దాంట్లోనో మదుపు చేస్తారు. ఏపాలసీ అయినా ఎంచుకునే ముందు మీరు చెల్లించే దానిలో ఎంత మొత్తాన్ని వారు మదుపు చేస్తున్నారో తెలుసుకోండి. మిగతా మొత్తం వారి నిర్వహణా వ్యయాలకు పోతుంది. అంత నిర్వహణా వ్యయంతో మీకు సరిపోయినంత ఇన్సూరన్సును మీరు తీసుకొనగలరో లేదో ఆలోచించండి. నా అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వాటి జోలికి పోకుండా పైన చెప్పిన విధంగా మీకు కావలసినంత పాలసీని టర్ము ప్లానులో తీసుకొని మిగతాది మీ అభిరుచికి తగ్గట్లుగా వేరే దానిలో మదుపుచేసుకొనడం ఉత్తమం.

గమనిక: నేనొక సాదారణ కంప్యూటరు కూలీని. ఇవన్నీ నాఅవసరం కొరకు నేను పరిశోధన చేసి తెసుసుకొన్న విషయాలు. కొందరికైనా ఉపయోగ పడవచ్చని ఇక్కడ రాస్తున్నాను. నేను ఆర్ధిక నిపుణున్ని కాను కాబట్టి నావిశ్లేషణలో  కొన్ని తప్పులుండవచ్చు. ఇలాంటి వ్యాసాలు రాయడం ఇదే మెదటిసారి కాబట్టి, దీనిలో భాషా పరమయిన తప్పులుకూడా ఉండొచ్చు. వీటిని నాదృష్టికి తెచ్చినట్లయితే సరిచేసుకోడానికి ప్రయత్నిస్తాను.

నాకు ఆధారమయిన కొన్ని లంకెలు:

http://ia.rediff.com/money/2003/nov/17perfin1.htm
http://www.rediff.com/money/2005/jan/04perfin1.htm
http://www.chennaionline.com/finance/insurance-news002.asp

ప్రకటనలు

మరో అమ్మాయి

రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.